White Paper : శ్వేతపత్రాన్ని ఆంధ్రా అధికారులు తయారుచేశారు - హరీశ్ రావు

Update: 2023-12-20 08:05 GMT

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పులతడకగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు, ప్రగతి కోణంలో అది లేదని విమర్శించారు. శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు.. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక సస్పెండైన ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి గురువు దగ్గర పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి శ్వేతపత్రం తయారు చేశారని, కావాలంటే వారి పేరు సైతం బయటపెడతానని హరీశ్ రావు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నమే తప్ప శ్వేతపత్రంలో ఇంకేమీలేదని హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ బలపడటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టి పునాదులు వేసిందని, రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలిపిందని చెప్పారు. కానీ శ్వేతపత్రంలో మాత్రం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. అప్పుల విషయంలో తెలంగాణ చివరి నుంచి ఐదో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ కన్నా 22 రాష్ట్రాలు ఎక్కువ అప్పు తీసుకున్నాయని వివరించారు. ప్రత్యర్థులపై రాజకీయ దాడికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. అప్పుల గురించి తప్ప ఆస్తుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని హరీశ్ రావు విమర్శించారు.

ఒకవైపు కరోనా.. మరోవైపు కేంద్రం వివక్ష చూపుతున్నా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బీఆర్ఎస్ సర్కారు ఏనాడూ ఆపలేదని హరీశ్ రావు చెప్పారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడూ వాటి గురించి మాట్లాడలేదని అన్నారు. అప్పులు - DSDP నిష్పత్తిని చూపకుండా అప్పు - రాబడి నిష్పత్తిని చూపడాన్ని హరీశ్ తప్పుబట్టారు. స్పెషల్ పర్సప్ వెహికిల్ రుణాలను సంబంధిత సంస్థలే చెల్లిస్తాయని, వాటి వల్ల రాష్ట్ర ఖజానాపై ఎలాంటి భారం పడదని స్పష్టం చేశారు. ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రాలేదని, కేంద్రం నుంచి లక్ష కోట్లకుపైగా నిధులు రాకపోవడం వల్ల ఆ మేరకు అప్పులు పెరిగాయని వివరించారు. ఒకవేళ కేంద్రం నిధులు ఇచ్చి ఉంటే రాష్ట్ర అప్పులు లక్ష కోట్ల మేర తగ్గేవని హరీశ్ రావు స్పష్టం చేశారు.




Tags:    

Similar News