White Paper : శ్వేతపత్రం పేరుతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు - హరీశ్ రావు

Byline :  Kiran
Update: 2023-12-20 08:13 GMT

ఆర్థిక స్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తే భవిష్యత్తులో రాష్ట్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం దివాలా తీసిందని ప్రచారం చేస్తే ఎఫ్ఆర్బీఎం రుణాలపై వడ్డీ రేటు పెరగడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని అన్నారు.

ఎన్నికల ప్రచారం నుంచి కాంగ్రెస్ ఇదే ధోరణితో వ్యవహరిస్తోందని హరీశ్ విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం మూర్ఖత్వమని అన్నారు. పెద్దనోట్ల రద్దు, కరోనా సంక్షోభాలను తట్టుకుని బలమైన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. కరోనా కారణంగా ఖర్చులు పెరిగినా రైతు బంధు నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు. పంటకాలానికి ముందే 11 విడతల రైతు బంధు ఇచ్చి వారికి ఉపయోగపడేలా చేశామని చెప్పారు.

పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కారు రాష్ట్ర కీర్తిని, పరపతిని పెంచిందని హరీశ్ అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, బీమారు రాష్ట్రంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన హామీలను ఎగవేయడానికి, ఆరు గ్యారెంటీలను నెరవేర్చలేమనే కారణంతోనే శ్వేతపత్ర తెచ్చినట్లుందని విమర్శించారు. గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం తప్ప వైట్ పేపర్ లో కొత్తగా చెప్పిందేమీ లేదని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.




Tags:    

Similar News