Guvvala Balaraju : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టు
నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ లీడర్ గువ్వల బాలరాజును పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం మొదటిసారిగా అచ్చంపేట నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో వెల్దండ వద్ద ఆయన్ను అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు అచ్చంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నది. దీంతో మాజీ ఎమ్మెల్యే బాలరాజును పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
అచ్చంపేట మాజి ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు
— Guvvala Balaraju (@GBalarajuTrs) December 18, 2023
అచ్చంపేట మాజి ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు. ఓటమి అనంతరం మొదటిసారిగా అచ్చంపేట నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో వెల్దండ వద్ద అడ్డుకుని అక్రమంగా… pic.twitter.com/CaLOGVqbie
విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. తమ నాయకుడి అరెస్టు అక్రమమని, గువ్వల బాలరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని, పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులను అణచివేయాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్ మీట్, అంబటిపల్లి గ్రామంలో ఆలయంలో నిర్వహించనున్న ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమానికి గువ్వల బాలరాజు హాజరు అవుతున్నారని ఆదివారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గువ్వల పర్యటనలను అడ్డుకోవాలని పిలుపునిచ్చాయని తెలిసింది.