నేడే కాంగ్రెస్​ అభ్యర్థుల తొలి జాబితా.. తుమ్మల, పొంగులేటి సీట్ల మార్పిడి

Byline :  Veerendra Prasad
Update: 2023-10-15 03:12 GMT

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను.. ఆ పార్టీ అధిష్ఠానం ఈ రోజు విడుదల చేయనుంది. 70స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైనా.. వామపక్షాలతో పొత్తు చర్చలు నడుస్తున్నందున 58 స్థానాలకే తొలి జాబితా విడుదల చేయనున్నారు. శనివారం అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్ మురళీధరన్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఆరు గంటలపాటు సమావేశమై.. అనేక విషయాలు చర్చించారు. మొదట 58 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని.. మిగిలిన సీట్లపై చర్చలు జరుగుతున్నాయని ​, స్క్రీనింగ్​ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అన్నారు​. రెండు రోజుల్లో తుది రూపు వస్తుందని, వామపక్షాలతో చర్చలు కూడా తుదిదశలో ఉన్నాయని చెప్పారు.

తొలి జాబితా ప్రకారం.. ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బరిలో దిగనున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఈ ఇద్దరు సీట్లను మార్చుకున్నారు. ఢిల్లీలోని అధిష్టానం పెద్దల సాక్షిగా ఈ పరిణామం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ చొరవతో ఈ సీట్ల మార్పునకు ఇద్దరు నేతలు అంగీకరించినట్లు తెలిసింది. పాలేరు నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత అక్కడి నుంచే పోటీ చేయాలని అనుకున్నారు. పొంగులేటి కూడా పాలేరు లేదా కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి పోటీ చేయాలని భావించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు కాగా మిగిలిన 3 సీట్లపై ఈ తరహా పోటీ నెలకొనడంతో అధిష్టానం లోతుగా అధ్యయనం చేసింది.

ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లలో ఏ సామాజికవర్గం ప్రజలు ఎంత మంది ఉన్నారన్న లెక్కలు తీసింది. ప్రత్యర్థి బీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థుల సామాజికవర్గాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు తెలిసింది. గెలుపే పరమావధిగా ముందుకెళ్లాలంటే పొంగులేటి పాలేరు నుంచి, తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేయడమే ఉత్తమం అన్న అభిప్రాయానికి వచ్చింది. తద్వారా ఖమ్మం పట్టణంలో సుమారు 50 వేల మంది జనాభా ఉన్న ‘కమ్మ’ సామాజికవర్గం ఓటర్లను పొంగులేటి కంటే తుమ్మల ఎక్కువగా ఆకట్టుకోగలరని అధిష్టానం భావించింది. ఇదే విషయాన్ని తుమ్మలకు అధిష్టానం పెద్దలు చెప్పినట్టు తెలిసింది. ఇక తుమ్మల కూడా పార్టీ ఎక్కణ్ణుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కణ్ణుంచి పోటీ చేస్తానని మీడియా ముఖంగా తెలిపారు. 




Tags:    

Similar News