TS Assembly Elections 2023 :డబ్బున్న వాళ్లకి కాదు.. దమ్మున్న వారికి టికెట్లు ఇవ్వాలి.. రేణుకాచౌదరి

Byline :  Veerendra Prasad
Update: 2023-10-27 08:22 GMT

కాంగ్రెస్‌లో మరోసారి టికెట్ల పంచాయితీ బయటపడినట్లు తెలుస్తోంది. తమ సామాజిక వర్గానికి(కమ్మవారి ఐక్య వేదిక నేతలు) చెందిన వారికి మొదటి లిస్టులో ఎలాంటి సీట్లు కేటాయించలేదని.. రెండో లిస్టులో అయినా సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ రేణుకాచౌదరి. కాంగ్రెస్ పార్టీలో కమ్మ కులానికి అధికంగా సీట్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో ఈ విషయమై చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ కులానికి తగిన ప్రాధాన్యం కల్పించాలన్నారు. సామాజిక న్యాయం జరగటం లేదని.. బయట నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. డబ్బున్న వాళ్లకే కాదు.. దమ్మున్న వారికి టికెట్లు ఇవ్వాలని కోరారు.

తెలంగాణ ఎన్నికల్లో కమ్మ కులస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని, కమ్మ కులస్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు. పిల్లికి బిచ్చం వేసినట్లు సీట్లు ఇస్తామంటే కుదరదని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఓడిపోయే నియోజకవర్గాలు ఇస్తాం అంటే తీసుకోమని... కమ్మ కులస్తులను తక్కువ అంచనా వేయొద్దంటూ చెప్పారని తెలిసింది. కమ్మ కులానికి ఎక్కువ సీట్లు ఇస్తే.. తమ ఓట్లు అన్నీ కాంగ్రెస్ పార్టీకే వస్తాయన్నారామె. మిగతా పార్టీల వాళ్లు కమ్మోళ్లకు పిలిచి టికెట్లు ఇస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కమ్మ వర్గానికి ఇవ్వలేదని.. మరో వర్గానికి ఏకంగా 38 సీట్లు ఇస్తే.. వారిలో చాలా మంది మిగతా పార్టీల్లోకి వెళ్లిపోయారన్నారు.  




Tags:    

Similar News