Gaddam Prasad Kumar : స్పీకర్‌ పదవికి నామినేషన్‌ వేసిన గడ్డం ప్రసాద్‌ కుమార్‌

Byline :  Kiran
Update: 2023-12-13 07:38 GMT

అసెంబ్లీ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ నామినేషన్ వేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కాంగ్రెస్ తరఫున స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలుచేశారు. నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, శ్రీధర్‌బాబు, పొంగులేటి, సీతక్క తదితరులు హాజరయ్యారు. సభాపతిగా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. సభాపతిగా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్‌ పత్రాలపై కేటీఆర్‌ సంతకం చేశారు.

స్పీకర్‌ ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం మద్దతు ప్రకటించడంతో గడ్డం ప్రసాద్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన వెంటనే ఆయన స్పీకర్​గా బాధ్యతలు చేపట్టనున్నారు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం ప్రసాద్.. 1964లో వికారాబాద్ జిల్లా బెల్కటూరు గ్రామంలో జన్మించారు. 1984లో తాండూర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.

తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన గడ్డం ప్రసాద్.. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థి సంజీవరావుపై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ పై 4,859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశాడు. 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్‌ కుమార్‌ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.




Tags:    

Similar News