తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా గోషామహల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఆయన ఈ ప్రక్రియ పూర్తి చేశారు. అబిడ్స్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాజాసింగ్ తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంతో పార్టీ కేంద్ర క్రమశిక్షణ సంఘం 2022 ఆగస్టు 23న రాజా సింగ్ను సస్పెండ్ చేసింది. తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసింది. బీజేపీ ఫస్ట్ లిస్టులోనే రాజాసింగ్ పేరు ప్రకటించింది. గోషామహల్ అభ్యర్థిగా బరిలో దింపుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాజాసింగ్ తాజాగా నామినేషన్ దాఖలు చేశారు.