Harish Rao : చింతా గెలుపు వెనక హరీష్, ఎర్రోళ్ల ... సంగారెడ్డిలో జగ్గన్నకు చెక్...
సంగారెడ్డి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఓడిపోయారు. ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలిచారు. 9వేల పైచిలుకు ఓట్లతో చింతా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈసారి కూడా గెలుపు తననేదని ధీమాగా ఉన్న జగ్గన్నకు ఈ ఫలితం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా వీస్తున్న వేళ సీఎం పోస్టుపై కన్నేసిన జగ్గారెడ్డి ఓడిపోవడం పార్టీలో కలకలం రేపుతోంది.
మాజీ ఎమ్మెల్యే అయిన చింతా ప్రభాకర్ ఈసారి కచ్చితంగా గెలిచి తీరాలని విస్తృతంగా ప్రచారం చేశారు. గెలుపుపై ధీమాగా ఉన్న జగ్గారెడ్డి ఆశించినంతగా ప్రచారం చేయకపోడం చింతాకు కలిసొచ్చింది. చింతాను గెలిపించే బాధ్యతను స్వయంగా చేపట్టిన మంత్రి హరీశ్ రావు నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 సీట్లలో పార్టీ అభ్యర్థులకు గెలిపించేందుకు క్షేత్రస్థాయి నుంచి పనిచేశారు. పార్టీ శ్రేణులతో సమావేశమై ప్రజలకు చేరువయ్యే వ్యూహాలు రచించారు. అసంతృప్తులను బజ్జగించారు.
బీఆర్ఎస్ యువనేత, తెలంగాణ వైద్య సేవలు - మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా చింతా ప్రభాకర్ గెలుపు కోసం అహర్నిశం కష్టపడ్డారు. పార్టీ కార్యకర్తలను నిత్యం కలుస్తూ ఉత్సాహపరిచారు. నియోజక వర్గంలోని ముదిరాజ్, రెడ్డి, మైనార్టీ వర్గాల్లో బీఆర్ఎస్‌కు తగినంత మద్దతు లేకపోవడంతో సమస్యను పరిష్కరించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. హరీశ్ రావు ద్వారా వారి మద్దతు కూడగట్టారు. దళిత సామాజిక వర్గం ఓట్లను బీఆర్ఎస్ వైపు మళ్లించడంలో ఎర్రోళ్ల కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోయినా హరీశ్, కేసీఆర్ ఆదేశాలతో ఎర్రోళ్ల పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అంకిత భావంతో పనిచేశారు. చింతా ప్రభాకర్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులు కూడా ప్రజలను ఆలోచింపజేశాయి.. జగ్గారెడ్డి ప్రజలకు తగినంతగా అందుబాటులో లేకపోవం కూడా ఆయన ఓటమి కారణమైంది.