Harish Rao : కార్యకర్తలు కుంగిపోవద్దు.. ఆ ఎన్నికల్లో సత్తా చాటాలి : హరీష్ రావు

Byline :  Krishna
Update: 2023-12-12 10:19 GMT

బీఆర్ఎస్ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కుంగిపోవద్దని.. వచ్చే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి సత్తా చాటాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని చెప్పారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలినా.. సంగారెడ్డిలో మాత్రం గులాబీ జెండా ఎగిరడం సంతోషంగా ఉందన్నారు. చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బ తిన్నా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేశారని మెచ్చుకున్నారు.

తెలంగాణపై కేసీఆర్ కు ఉన్న ప్రేమ ఇతర పార్టీలకు ఉండదని హరీష్ రావు అన్నారు. 14 ఏళ్లు ఎంతో కష్టపడి.. పదవులను త్యాగం చేసి తెలంగాణ తెచుకున్నామని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదు..లేనప్పుడు కుంగిపోలేదన్నారు. అధికార పక్షమైనా.. ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ది ఎప్పుడు ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని.. వాళ్లు మనకంటే బాగా పని చేయాలని కోరుకుందామన్నారు. కాంగ్రెస్‌ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం కొట్లాడుదామని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై పోరాడే వారికే భవిష్యత్తు ఉంటుందని.. కార్యకర్తలంతా అధైర్యపడొద్దని సూచించారు.


Tags:    

Similar News