Harish Rao : బీజేపీ మాటలు.. నీటి మీద రాతలు: హరీశ్ రావు

Byline :  Bharath
Update: 2023-11-20 06:44 GMT

బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ మంత్రి హరీశ్ రావు ప్రచారంలో జోరు పెంచారు. సిద్దిపేటతో పాటు రాష్ట్రంలో పలు నియోజకవర్గాలను పర్యటిస్తూ.. ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభల్లో పాల్గొంటుండగా.. ఆయన స్థానంలో హరీశ్ రావు గజ్వేల్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గజ్వేల్ లో క్యాంపెయిన్ నిర్వహించిన హరీశ్ రావు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ మాటలు నీటి మీద రాతలని ఎద్దేవాచేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ గెలవదని తెలిసి రోజుకో నాయకుడు పార్టీకి రాజీనామా చేస్తున్నారని అన్నారు. సొంతపార్టీ నాయకులు.. వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ లకు బీజేపీ గెలుస్తుందనే నమ్మకం లేదని అన్నారు. దుబ్బాకలో గెలిచిన రఘునందన్ రావు ఆ ప్రాంతంలో ఏ డెవలప్మెంట్ చేయలేదని మండిపడ్డారు.

చేతల నాయకుడు కావాలా? మాయమాటలు చెప్పే నాయకుడు కావాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలని చెప్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికోసం బిల్లు తయారుచేసి కేంద్ర ఆమోదం కోసం పంపిస్తే.. కుట్రపూరితంగా అమలు చేయకుండా వాయిదా వేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలని రాష్ట్రాన్ని నాశనం చేయడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. పోయిన ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచిన బీజేపీ.. ఈసారి అది కూడా గెలవడం డౌట్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏదైనా ఇచ్చిందా అంటే.. అది జీఎస్టీనే అని విమర్శించారు. కాంగ్రెస్ ను గెలిపించేందుకు తెలంగాణకు క్యూ కడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. గెలిచిన తర్వాత ఇటువైపుకు కూడా చూడరని అన్నారు.




Tags:    

Similar News