Assembly Election 2023 : మీకు ఓటర్ స్లిప్ అందలేదా..? అయితే ఇలా చేయండి..

Byline :  Kiran
Update: 2023-11-28 13:25 GMT

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్ స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు 80శాతం మంది ఓటర్లకు స్లిప్పులు అందజేశారు. ఎన్నికల సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు అందిస్తున్నారు. అయితే ఆ స్లిప్పులు అందనివారు సంబంధిత బీఎల్‌ఓ మొబైల్ నెంబర్ తెలిస్తే ఫోన్ చేసి వారి నుంచి పొందే అవకాశముంది.

ఓటర్ స్లిప్పులు అందనివారు ఆన్ లైన్, మొబైల్ యాప్, హెల్ప్ లైన్ నెంబర్, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా పొందవచ్చని ఎన్నికల సంఘం చెప్పింది. ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ను టైప్ చేసి 1950 లేదా 9211728082 అనే నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే ఓటర్ స్లిప్ వివరాలు వస్తాయి. www.ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో సెర్చ్ యువర్ నేమ్ - అసెంబ్లీ నియోజకవర్గం- ఓటర్స్ సర్వీస్ పోర్టల్ మెనూ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు లేదా మొబైల్ నెంబర్ లేదా పేరును ఇవ్వడం ద్వారా ఏ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయవచ్చో తెలుసుకోవడంతో పాటు డిజిటల్ స్లిప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా www.electoralsearch.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా ఇవే వివరాలను పొందుపరిచి ఓటర్ డిజిటల్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

www.voters.eci.gov.in అనే వెబ్‌సైట్‌లో సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే ఆప్షన్‌ సెలెక్ట్ చేసి వ్యక్తుల వివరాలను పొందుపరిచి తెలుసుకోవచ్చు. www.ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో ఆఫీసర్స్ డీటెయిల్స్ - బూత్ లెవల్ ఆఫీసర్స్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ద్వారా జిల్లా, నియోజకవర్గం, అక్కడి పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్ఓల ఫోన్ నెంబర్లను తెలుసుకుని వారికి ఫోన్ చేసి బూత్ నెంబర్ వివరాలను పొందొచ్చు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 24 గంటలూ పనిచేసే హెల్ప్ లైన్ (టోల్-ఫ్రీ) నెంబర్ 1950కి ఫోన్ చేసి ఓటర్ల వివరాలను లేదా ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ చెప్పి పోలింగ్ కేంద్రం, బూత్, నెంబర్ తదితరాలను పొందవచ్చు.

complaints@eci.gov.in ఐడీకి మెయిల్ చేసి కూడా పోలింగ్ బూత్ వివరాలను మెయిల్ ద్వారా పొందవచ్చు. ఇక ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఏ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయాలో తెలుసుకోవచ్చు.




Tags:    

Similar News