TS Assembly Elections 2023 : అందరినీ మేనేజ్ చేసేందుకు అవినీతికి పాల్పడలేదు - జూపల్లి కృష్ణారావు

By :  Krishna
Update: 2023-10-16 15:34 GMT

బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం కేసీఆర్ తనను అహంకారి అనడంపై జూపల్లి కృష్ణారావు స్పందించారు. తనకు అహంకారం ఉండుంటే తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసేవాడినా అని ప్రశ్నించారు. వేలకోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసీఆర్ను మించిన అహంకారి ఉండరని అన్నారు. అందరినీ మేనేజ్ చేసేందుకు తాను ముఖ్యమంత్రిలా అవినీతికి పాల్పడలేదని జూపల్లి విమర్శించారు.

కేసీఆర్ అహంకారంతోనే అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేయలేదని, కనీసం అమరవీరుల కుటుంబాలను సైతం పరామర్శించలేదని జూపల్లి మండిపడ్డారు. ధనబలం, అహంకారంతోనే మంత్రులు వెళ్లినా ప్రగతి భవన్ గేట్లు తెరవరని అన్నారు. ముఖ్యమంత్రి దగ్గర వేల కోట్లున్నా, పదవులున్నాఅవి తన కాలి గోటికి సరిపోవని ఫైర్ అయ్యారు. ఏ విషయంలో గొప్పోళ్లో చెప్పేందుకు కేసీఆర్ కొడుకు, అల్లుడిలో ఎవరు చర్చకు వస్తారని జూపల్లి నిలదీశారు.

బీఆర్ఎస్ గతంలో ఇచ్చిన దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం హామీలు ఏమయ్యాయని జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. సోనియా, రాహుల్ గాంధీలనైనా కలవొచ్చుగానీ ప్రగతి భవన్ కు వెళ్లి సీఎంను మాత్రం కలవలేమని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యమన్న ఆయన.. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు ఎలా సాధ్యమవుతాయని జూపల్లి నిలదీశారు. ప్రజలు కేసీఆర్ మాటలు విని మరోసారి మోసపోవద్దన్న ఆయన.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.




Tags:    

Similar News