TS Assembly Elections 2023 : కామారెడ్డి స్పెషల్.. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఒంటిచేత్తో ఓడించాడు.. ఎవరీ కాటిపల్లి?
కేసీఆర్ గజ్వేల్ తోపాటు పోటీ చేసిన కామారెడ్డి నియోజకర్గం ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అక్కడ బరిలోకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొని ఉత్కంఠ రేపింది. ఫలితాల సరళి కూడా ముగ్గురి మధ్య దోబూచులాడింది. చివరికొచ్చేసరికి విజయం బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డిని వరించింది. రెండో స్థానంలో రేవంత్, మూడో స్థానంలో సీఎం నిలిచారు. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఒంటి చేత్తో ఓడించిన వెంకటరమణ రెడ్డి ఈ ఎన్నికల అసలు విజేత అని ప్రశంసల వర్షం కురుస్తోంది.
రేవంత్, కేసీఆర్ నాన్ లోకల్ కావడంతోపాటు సరైన వ్యూహం లేకపోవడం, స్థానిక సమస్యలు, కామారెడ్డి మాస్టర్ ప్లానింగ్‌పై ప్రజల నిరసన ఎన్నికల ఫలితాలన్ని ప్రభావితం చేశాయి. మాస్టర్ ప్లాన్‌ను కేసీఆర్ ప్రభుత్వం ఉపసంహరించుకున్నా ప్రజల్లో అనుమానాలు పోలేదు. తమ భూములకు ఎసరు పెడతారనే భయం వారిలో కనిపించింది. రేవంత్ రెడ్డి నియోజకర్గంలో ముమ్మరంగా ప్రచారం చేయడంతో గెలుపుకు చేరువగా వచ్చారు. ఇక వెంకటరమణా రెడ్ తొలి నుంచి తన మానాన తాను ప్రచారం చేసుకుపోయారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానిక కృషి చేశారు. సొంత జేబు నుంచి కోట్లు ఖర్చు పెట్టి సమస్యలు తీర్చారు. బీజేపీలో ఉన్నా వివాదాల జోలికి పోయే మనిషి కాకపోవడంతో ఓటర్లు ఆయనకు పట్టం కట్టారు.
వెంకట రమణారెడ్డి కామారెడ్డి వాస్తవ్యుడు. పలు వ్యాపారాలు చేస్తున్నారు. 2018లో కామారెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ 60 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పడు 15 వేల ఓట్లతో మూడోస్థానంలో సరిపెట్టుకున్నారు. తాజా ఎన్నికల్లో తనకంటే అన్నివిధాలా బలవంతులైన కేసీఆర్, రేవంత్ లు బరిలో ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. లోకల్ సెంటిమెంట్¡తో ప్రజలను ఆకట్టుకుని విజయం సాధించారు.