TS Assembly Elections 2023 : మళ్లీ గెలిపిస్తే.. రెండో విడత డెవలప్మెంట్ పూర్తి చేస్తా: కేసీఆర్
TS Assembly Elections 2023తూంకుంటలో జరుగుతున్న కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. తనను కడుపులో పెట్టుకుని గెలిపించిన గజ్వేల్ బిడ్డలకోసం.. చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని చెప్పుకొచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీ 95 నుంచి 100 స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇకమీదట నెలలో ఒకరోజు గజ్వేల్ కోసం కేటాయించి, ప్రజల సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు.
ఇప్పటివరకు గజ్వేల్ కు జరిగిన అభివృద్ధిని చూసి సంతృప్తి చెందొద్దని, చేయాల్సిం ఇంకా చాలా ఉందని స్పష్టం చేశారు. గజ్వేల్ లో ఒక్క నిరుపేద కూడా ఉండద్దనేది తన లక్ష్యం అని చెప్పుకొచ్చారు. గజ్వేల్ లో ఒక విడత పనులు మాత్రమే పూర్తయ్యాయి.. ఇంకా రెండో విడత బాకీ ఉంది. కామారెడ్డిలో కూడా పోటీ చేయడానికి కొన్ని కారణాలుఉన్నాయని, గజ్వేల్ ను విడిచే ప్రసక్తే లేదని కేసీఆర్ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వలసలు, నీటి కష్టాలు తీరాయని అన్నారు. వ్యవసాయ స్థిరీకరణ జరిగితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించా. సాగు ఖర్చుల కోసం రైతులకు డబ్బులు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు నడిచానని చెప్పారు. మిషన్ భగీరథకు స్ఫూర్తి సిద్దిపేటలో అమలు చేస్తున్న తాగునీటి పథకమే అని కేసీఆర్ వివరించారు.