Komati Reddy : సోనియాకు బర్త్డే గిఫ్ట్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. దాదాపు 60 సీట్లు గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో దూసుకుపోతున్న అభ్యర్థులు కాంగ్రెస్ కు మ్యాజిక్ ఫిగర్ అందించేలా కనిపిస్తున్నారు. దాదాపు రెండు నెలల నుంచి తీవ్రంగా కష్టపడ్డ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపులో కీలకం అయ్యారు. పార్టీని ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్టానం పొగడ్తలతో ముంచుతోంది. గొడవలకు కేరాఫ్ అన్న కాంగ్రెస్ ను ఏకతాటిపై నడిపించింది రేవంత్ అని అంటున్నారు. ఈ క్రమంలో రేవంత్ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ కోసం రేవంత్‌రెడ్డి కష్టపడి పని చేశారని చెప్పుకొచ్చారు. తాను సీఎం రేసులో ఉన్నానా..? లేదా అనేది అప్రస్తుతం అని చెప్పారు. తెలంగాణలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలని ప్రజలు కోరుకున్నారని, అదే ఇప్పుడు నిజమైందని చెప్పారు. అధికారం చేపట్టాక రాబోయే ఐదేళ్లు పార్టీలో ఎలాంటి గొడవలు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణలో గెలిచి సోనియా గాంధీకి బర్త్‌డే గిఫ్ట్ ఇస్తున్నామని, సీఎం అభ్యర్థిని ఖర్గే, సోనియాగాంధీ నిర్ణయిస్తారని అన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాబట్టి ఫార్మాలిటీ ప్రకారం పోలీసులు ఆయనకు బంధోబస్తు కల్పించారని అన్నారు.