KTR : బీఆర్ఎస్ పాలన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం : కేటీఆర్
కాంగ్రెస్ తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే యత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ సహా బీఆర్‌ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనపై ‘స్వేదపత్రం’ పేరుతో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలు, ఆరోపణలకు బాధ్యత కలిగిన పార్టీగా స్వేద పత్రంతో నిజాలను చెప్తున్నామన్నారు. శాసనసభలో తమ పార్టీ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, హరీశ్‌రావు ప్రభుత్వ ఆరోపణలకు గట్టి సమాధానాలు ఇవ్వడంతో తమ గొంతు నొక్కిందని అన్నారు. అందుకే ప్రజలకు అన్నీ తెలియడం కోసం స్వేద పత్రం విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు.
కొత్త రాష్ట్రంలో గత పదేళ్ల ప్రగతి ప్రస్థానం ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయం అని కేటీఆర్ అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు.. సంక్షోభం వైపు సమృద్ధి వైపు జరిగిన ప్రయాణమని చెప్పారు. నేరపూరిత నిర్లక్ష్యంతో ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే, జీవన విధ్వంసం చేసే ప్రయత్నం అప్పటి పాలకులు చేశారు. ఎక్కడికి చేరుకున్నామో తెలియాలంటే.. ఎక్కడ మొదలయ్యామో కూడా గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉందన్నారు. రాష్ట్ర స్థూల రుణం రూ.3.17 లక్షల కోట్లు కాగా.. దీన్ని కాంగ్రెస్ నేతలు రూ.6.70 లక్షల కోట్లుగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
60 ఏళ్ల గోసను 10 ఏళ్లలో మాయం చేశామని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో సంక్షేమం, కరెంట్, వ్యవసాయం, చెరువులు, పల్లె,పట్టణ ప్రగతి లాంటి అంశాలను ప్రాధాన్య క్రమంలో తీసుకుని పనిచేసినట్లు తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణం సాగించామన్నారు. గతంలో ఏటా పాలమూరు నుంచి 14 లక్షల మంది వలసవెళ్లే వారని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ సమైక్య పాలనలో పూర్తిస్థాయి సంక్షోభం వైపు మళ్లిందన్నారు. కానీ బీఆర్ఎస్ 10ఏళ్ల పాలనలో తెలంగాణను తిరిగి నిలబెట్టినట్లు స్పష్టం చేశారు.