KTR : ఒక్క బ్యారేజీలో తప్పు జరిగితే కాళేశ్వరం మొత్తాన్ని తప్పుబడతారా : కేటీఆర్

Byline :  Krishna
Update: 2023-12-24 08:25 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అప్పులను ఎక్కువ చేసి చూపిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర స్థూల రుణం రూ.3.17 లక్షల కోట్లు కాగా.. దీన్ని కాంగ్రెస్‌ నేతలు రూ.6.70 లక్షల కోట్లుగా చూపించారని మండిపడ్డారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలను, గ్యారంటీ ఇవ్వని రుణాలను కూడా అప్పులుగా చూపుతున్నారన్నారు. నిల్వలు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులను దాచి అప్పులు ఎక్కువగా ఉన్నాయని చూపడం కరెక్ట్ కాదన్నారు. జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ తప్పుడు లెక్కలు చూపెట్టారని విమర్శించారు.

తెలంగాణలో గత పదేళ్ల రూ.13,72,930 కోట్లు ఖర్చు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. అయితే ఒక్క విద్యుత్‌ రంగంలో తాబు రూ.6,87,585 కోట్ల ఆస్తుల్ని సృష్టించినట్లు చెప్పారు. విద్యుత్‌ సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 25వేల మెగావాట్లకు పెంచామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని కేటీఆర్‌ తెలిపారు. కానీ ఆర్థిక క్రమశిక్షణతో ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగామని తెలిపారు. రాష్ట్రానికి అస్థిత్వమే కాదు.. ఆస్తులు కూడా సృష్టించామని స్పష్టం చేశారు.

కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టునే తప్పుబట్టడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో తప్పు జరిగితే సరి చేయాలన్న కేటీఆర్.. కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ‘‘ మేం ఏ విచారణకైనా సిద్ధం.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి. మాపై కోపంతో రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చకండి. ఇప్పటికే 90శాతం పూర్తి చేసిన పాలమూరు - రంగారెడ్డి పనులు పూర్తి చేసి నీరు ఇవ్వండి. క్రెడిట్ మీరే తీసుకోండి.. కానీ ప్రాజెక్టులను బద్నాం చేయొద్దు’’ అని కేటీఆర్ అన్నారు.


Tags:    

Similar News