Telangana Assembly 2023 : అప్పులే కాదు.. ఆస్తుల గురించి కూడా మాట్లాడండి: కేటీఆర్
అప్పులే గురించే కాదు ఆస్తుల గురించి కూడా మాట్లాడాలని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. శనివారం కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగానికి సంబంధించిన అప్పులు, ఆస్తుల గురించి కేటీఆర్ లెక్కలతో సహా వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని అధికార పార్టీ నేతలు అంటున్నారని.. అప్పుల గురించే కాదు బీఆర్ఎస్ హయాంలో తాము సృష్టించిన ఆస్తుల గురించి కూడా మాట్లాడాలని అన్నారు. 2014లో బీఆర్ఎస్ అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర విద్యుత్ సంస్థల అప్పులు రూ.22,423 కోట్లు ఉండేనన్న మంత్రి.. తమ పాలన ముగిసేనాటికి (2023 వరకు) ఆ అప్పులు రూ.81 వేల కోట్లకు చేరాయని అన్నారు. 2014లో తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ.44,431 కోట్ల విలువైన ఆస్తులు ఉండేవని, కానీ తమ హయాంలో రూ.1,37,571 కోట్ల విలువైన ఆస్తులను విద్యుత్ రంగంలో సృష్టించామని కేటీఆర్ వివరించారు. తమకు అప్పగించే నాటికి అత్యంత దురావస్థలో ఉన్న ట్రాన్స్ కో, జెన్ కోలను గాఢిలో పెట్టామన్న ఆయన.. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదనే విషయాన్ని అధికార పార్టీ నాయకులు గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.