Sudhir Reddy : పార్టీ మార్పు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన సుధీర్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే విపక్షాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వారంతా త్వరలోనే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ మార్పు అంశంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
తనతో పాటు బీఆర్ఎస్ కు చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారబోరని అన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే పార్టీ మారాల్సిన అవసరం లేదని అన్నారు. ఓ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేయాలో అంత చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని సుధీర్ రెడ్డి తెలిపారు. కాగా 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డి.. కొంతకాలం తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే తాను అధికార పార్టీలో చేరినట్లు ఆయన అప్పట్లో అన్నారు.