TS Assembly Elections 2023 : బద్దకించిన భాగ్యనగరం.. ఓటేసేందుకు మళ్లీ ఆసక్తిచూపని జనం..

Byline :  Kiran
Update: 2023-11-30 12:25 GMT

భాగ్యనగరవాసులు మళ్లీ బద్ధకించారు. ఐదేళ్ల భవిష్యత్తును నిర్దేశించడంలో విఫలమయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో నగరవాసులు మరోసారి ఆసక్తి చూపలేదు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలో అతి తక్కువ పోలింగ్ శాతం హైదరాబాద్లోనే నమోదైంది. పోలింగ్ డేను సెలవు రోజుగా భావించిన సిటీ ఓటర్లలో సగం మంది కూడా పోలింగ్ స్టేషన్ వైపు తిరిగి చూడలేదు. గతంలోలాగే ఈసారి కూడా హైదరాబాదీలు ఓటేసేందుకు ముఖం చాటేశారు. ఉదయాన్ని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూలలో నిలబడి ఓటు వేసి బాధ్యతను గుర్తు చేసినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు ఎన్నికల సంఘం సైతం ఎన్ని ప్రయత్నాలు చేసినా పోల్ పర్సంటేజీ ఏ మాత్రం పెరగలేదు.

గురువారం పోలింగ్ కావడంతో ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని ఎలక్షన్ కమిషన్ భావించింది. అయితే హైదరాబాదీలు వారి అంచనాలను మరోసారి తలకిందులు చేశారు. పోలింగ్ సందర్భంగా కంపెనీలన్నీ ఐటీ ఎంప్లాయిస్ కు హాలీడే ప్రకటించింది. ఒకవేళ సెలవు ప్రకటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ కంపెనీలను హెచ్చరించింది. ఈ క్రమంలో ఈసారి ఐటీ ఎంప్లాయిస్ చాలా వరకు ఓటు వేస్తారని భావించారు. అయితే ఊహించిన దాని కన్నా భిన్నంగా ఈసారి కూడా పోలింగ్ స్టేషన్ల వైపు సగం మంది కన్నెత్తి చూడలేదు.

గురువారం పోలింగ్ జరగగా శుక్రవారం మినహాయిస్తే శని, ఆదివారాలు వీకెండ్స్. ఈ లెక్కన శుక్రవారం ఒక్క రోజు లీవ్ పెట్టుకుంటే వరుసగా 4 రోజులు లాంగ్ వీకెండ్ వస్తుంది. దీంతో చాలా మంది ఉద్యోగులు ఈసారి కూడా పోల్ డే ను హాలీడేగా భావించి టూర్స్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేప్టటినా ఉద్యోగుల్లో మార్పు రాలేదని స్పష్టం అవుతోంది. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ 50 శాతంలోపే ఓట్లు పోలయ్యాయి. 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.71 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో బస్తీవాసులు ఎక్కువగా ఉన్నారు. కాలనీల్లో ఉండే ఉన్నత విద్యావంతులు ఓటు వేయడానికి ఆసక్తి చూపించకపోవడం విశేషం.




Tags:    

Similar News