Prajapalana Application : ఆ పథకం కోసం భారీగా ప్రజాపాలన అప్లికేషన్లు

Byline :  Kiran
Update: 2023-12-30 02:24 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ఐదు పథకాల కోసం ప్రజాపాలన దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అప్లికేషన్లు సమర్పించేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. అయితే ప్రజాపాలనలో వస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువ మంది గృహజ్యోతి స్కీంకే టిక్ పెడుతున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మెజార్టీ జనం ఆ స్కీం కోసం దరఖాస్తు చేస్తున్నారు.

ప్రజాపాలనలో వస్తున్న అప్లికేషన్లను విద్యుత్ శాఖ అధికారులు ఏ రోజుకారోజు రికార్డు చేస్తున్నారు. సాయంత్రం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత విద్యుత్తు సిబ్బంది తమ పని ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో కేంద్రానికి ఏఈ, సబ్‌ ఇంజినీర్‌ నుంచి ఫోర్‌మెన్‌ వరకు సిబ్బందిని కేటాయించింది. వీరు అప్లికేషన్లను పరిశీలించి అందులో గృహజ్యోతికి వచ్చిన దరఖాస్తుల్లోని విద్యుత్తు సర్వీస్‌ నెంబర్, యూఎస్‌ఈ నెంబరు నమోదు చేసుకుంటున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో 100, 200 యూనిట్లులోపు ఎంత మంది టిక్‌ పెట్టారన్నది వివరాలను సైతం ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. సర్కిల్‌ వారీగా ఆ వివరాలను ఆ రాత్రికే కార్పొరేట్‌ కార్యాలయానికి పంపిస్తున్నారు.

ఇదిలా ఉంటే విద్యుత్తు వినియోగానికి సంబంధించి డిస్కం వద్ద పూర్తి సమాచారం ఉంది. రంగారెడ్డి జోన్‌, మేడ్చల్‌ జోన్‌ మెట్రోజోన్‌ పరిధిలో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు పథకం వర్తింపజేస్తే నగరంలో 40 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అయితే అప్లై చేసుకున్న వారందరికి ఉచిత విద్యుత్తు ఇస్తారా? ఏమైనా ఆంక్షలు పెడతారా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హతకు సంబంధించి మార్గదర్శకాలను వెల్లడిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.




Tags:    

Similar News