Kotha Prabhakar Reddy : అంబులెన్స్‌లో వెళ్లి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఎంపీ

Byline :  Veerendra Prasad
Update: 2023-11-09 08:38 GMT

మెదక్‌ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఇటీవల ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో గాయపడిన ప్రభాకర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్ధిగా దుబ్బాక నుంచి పోటీలో ఉండటం, నామినేషన్ దాఖలుకు ఎక్కువ సమయం లేకపోవటంతో ఆస్పత్రి నుంచి అంబులెన్సులో నేరుగా దుబ్బాకు చేరుకున్నారు. వీల్ చైర్ లో రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను ఆర్వో గరిమ అగర్వాల్ కు కొత్తా ప్రభాకర్ రెడ్డి అందజేశారు.

గత నెల 30న దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో కడుపులో తీవ్ర గాయం కావడంతో ఆయన్ను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. తొలుత గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం యశోదా ఆస్పత్రికి తరలించారు. దీంతో గత 10 రోజులుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ప్రభాకర్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. దుబ్బాకలోని అంబులెన్స్‌ దిగిన తర్వాత వీల్‌చైర్‌లో రిటర్నింగ్‌ కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ పత్రాలను ఆర్వో గరిమ అగర్వాల్‌కు సమర్పించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుండటంతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఆయా పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు.




 




 





Tags:    

Similar News