Harish Rao : అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న కాంగ్రెస్.. మంత్రి హరీష్ రావు

Byline :  Veerendra Prasad
Update: 2023-11-17 06:16 GMT

అమలుకానీ హామీలతో కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు. ఆరు గ్యారంటీలు ఇస్తామంటున్న ఆ పార్టీలో ఉద్యమకారులకు గ్యారంటీ లేదన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై మండిపడ్డారు. వంద అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తోందని.. కానీ కర్నాటక తరహాలో తెలంగాణ ప్రజలు మోసపోరని అన్నారు. కర్నాటక ఫెయిల్యూర్ మోడల్ ను మెడలో వేసుకొని రాష్ట్రానికి వస్తున్నారని.. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు.

కర్నాటకలోని కాంగ్రెస్ పాలన తీరును ఎండగడుతూ.. కర్నాటకలో అభివృద్ధికి నిధులు లేవని అక్కడి ఎమ్మెల్యేలు చెబుతున్నారని, అక్కడి ప్రజలు ఇప్పటికే ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో కర్నాటక దివాళా తీసిందని, అక్కడ ఏం జరుగుతుందో తెలంగాణ రైతులు గమనించాలన్నారు. వెలుగుల దీపావళి కావాలా..? దివాళా తీసిన కర్నాటక కావాలా? అని అడిగారు.

6 నెలల క్రితం చిన్న తప్పుకు కర్నాటక ప్రజలు బాధ పడుతున్నారన్నారు. ఆ రాష్ట్రంలో హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ ఆచూకీ లేదన్నారు. ఎన్నికల తర్వాత కర్నాటక రాహుల్ గాంధీ కర్ణాటకకు వెళ్లలేదన్నారు. కర్నాటక లో ఉన్న పథకాలకే కాంగ్రెస్ నేతలు కోత పెడుతున్నారన్నారని, రోడ్లు వేయడానికే డబ్బులు లేవని డీకే శివకుమార్ అన్నారన్నారు. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో తాను రైతును అని గర్వంగా చెప్పుకునే స్థితికి కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. కర్నాటకలో రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే గుండెపోటు గ్యారెంటీ అన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతు ఆత్మహత్యలు లేవన్నారు. కర్నాటకలో 6 నెలల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదన్నారు. ఆ పార్టీ నేతలు మహిళలను అవమానపరుస్తున్నారని, వారి తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందన్నారు. వన్ ఛాన్స్ కాంగ్రెస్ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.




Tags:    

Similar News