Harish Rao : మేనిఫెస్టోలో పెట్టని ఎన్నో పథకాలు తీసుకొచ్చాం.. మంత్రి హారీశ్ రావు
తెలంగాణ సాధన కోసం నిబద్ధతో పని చేశామని, ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక అన్ని రంగాల్లో తెలంగాణ మార్క్ కనిపించేలా చేశామని అన్నారు మంత్రి హారీశ్ రావు. అన్ని రంగాల్లోనూ ఎన్నో అవార్డులను తెలంగాణ గెల్చుకుందని, కేసీఆర్ పాలనను కేంద్రం సైతం మెచ్చుకుందని అన్నారు. హైదరాబాద్‌లో ‘తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా ఎంతో మెరుగ్గా తెలంగాణలో పాలన ఉందన్నారు.
గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో 90 శాతం హామీలు పూర్తి చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టని ఏన్నో పథకాలు తీసుకొచ్చామన్నారు. ఎన్నికల హామీల్లో ప్రకటించని కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కేసీఆర్ బీమా, రైతుబంధు వంటి పథకాలను అమలు చేశామన్నారు.
‘‘రాష్ట్రంలో విద్యుత్ సమస్యను అధిగమించాం. కోతలు లేని విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంతో రైతులు అన్ని కాలాల్లో పంటలు పండించుకుంటున్నారు. మోటార్లు కాలిపోవడం లేదు. రైతుబంధు కింద రైతులకు రూ.73 వేల కోట్ల పంపిణీ చేశాం. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దాం. పల్లె కన్నీరు పెడుతోంది అనే పాటలు పాడుకునే పరిస్థితిపోయి.. పట్టణాల నుంచే పల్లెలకు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం సౌకర్యంగా తమ పనులు చేసుకునే స్థాయిలో అభివృద్ధి చేశాం. నాటి కాంగ్రెస్ పాలనను నేటి కేసీఆర్ పాలనను బేరీజు వేసుకొని ప్రజలు ఓటెయ్యాలని కోరుతున్నాను’ అని హరీశ్ వివరించారు.