TS Assembly Elections 2023 : గంగులపై పోటీ అంటే పోశమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్లే - మంత్రి కేటీఆర్
(TS Assembly Elections 2023) బీజేపీ, కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రం మళ్లీ 50 ఏళ్లు వెనక్కి వెళ్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. మంత్రి గుంగుల మీద పోటీ అంటే పోశమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్లేనని అభిప్రాయపడ్డారు. ఆయనను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ కు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌లోనే బీజం పడిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో పదేండ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని కేటీఆర్ చెప్పారు. మానేరు నీళ్ల కోసం జరిగిన కొట్లాట ఇంకా కళ్ల ముందే కదలాడుతోందన్న ఆయన.. కాళేశ్వరం రాకతో ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సజీవ జలధారగా మారిందని అన్నారు. గంగుల నాయకత్వంలో బీసీ సంక్షేమం అద్భుతమైన ప్రగతి సాధించిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
హిందూ, ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టే వారు కరీంనగర్‌లో ఉన్నారని కేటీఆర్ మండిపడ్డారు. కమలాకర్ చేతిలో చావు దెబ్బ తిని దొంగ ఏడుపుతో ఎంపీ అయ్యారని విమర్శించారు. కమలాకర్ పై పోటీ చేసేందుకు అందరూ జంకుతున్నారని అన్నారు. కాంగ్రెసోళ్లు ఇప్పటికే హుస్నాబాద్ పారిపోగా.. బీజేపోళ్లు పోటీకి వెనుక ముందవుతున్నారని చెప్పారు. ఇక్కడ ఎంపీ పదేపదే మసీదులు తవ్వుదామని అంటాడని, అసలు బొందల గడ్డలు తవ్వేందుకే బండి సంజయ్ ఎంపీ అయిండా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చినా మోసపోవద్దని, కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ ను దీవించండని కరీంనగర్ ఓటర్లను అభ్యర్థించారు.