Minister Ponnam Prabhakar:చూస్తూ ఊరుకోం.. రాజాసింగ్‌కు పొన్నం ప్రభాకర్ వార్నింగ్!
కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..110 సీట్లల్లో డిపాజిట్లు రాని బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతోందని వ్యాఖ్యానించడం ఆశ్యర్యంగా ఉందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏమైనా జోతిష్యం చదివావా.. ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులు గడవక ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 ఎమ్మెల్యే పార్టీ మారుతారని ఏ ఉద్దేశ్యంతో వ్యాఖ్యానిస్తున్నావు..జాగ్రత్త అని హెచ్చరించారు. హైదరాబాద్‌లో మత కలోల్లాలు వస్తాయని మాట్లాడడం చూస్తుంటే రాష్ట్రంలో బీజేపీ ఇతర పార్టీలతో కలిసి హంగ్ ప్రభుత్వం తెవాలని కుట్రలు చేస్తున్నట్లు అర్థం అవుతుందన్నారు. సీనియార్టీ ప్రకారం ప్రొటెం స్పీకర్ ను నియమిస్తే మత పరమైన అంశం తీసుకొచ్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారని.. బుద్ధి,జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడవచ్చా..? అని ప్రశ్నించారు. ఇదంతా గమనిస్తే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని మరోసారి రుజువైందని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. ప్రజాస్వామ్య యుతంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వీరు మాట్లాడుతున్న మాటలను సభ్య సమాజం అసహ్యహించుకుంటుందన్నారు. ప్రతి పక్షాల సలహాలను తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. రాజకీయ క్రీడకు పాల్పడితే చూస్తూ ఊరుకోమన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ మారరని..ప్రజలు తీర్పు ఇచ్చారు..ప్రభుత్వం మారింది..ప్రతిపక్షాలు మైండ్ సెంట్ మార్చుకోవాలి.. మూర్ఖపు ఆలోచనలు మార్చుకోవాలని హితవు పలికారు.