Neelam Madhu : నమ్మించి మోసం చెయ్యడం కాంగ్రెస్ పార్టీ నైజం.. నీలం మధు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ పటాన్‌చెరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. పటాన్‌చెరు కాంగ్రెస్ టికెట్ ఆశించి ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్ (Neelam Madhu)కు ఆ పార్టీ హ్యాండ్ ఇచ్చిందిద. మొదట టికెట్ ప్రకటించిన అధిష్టానం.. ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) ఒత్తిడితో చివరి క్షణంలో కాటా శ్రీనివాస్ (Kata Srinivas)కు టికెట్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీపై నీలం మధు వర్గం అసహనం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ అధిష్టానంపై, దామోదర్ రాజా నర్సింహపై మండిపడ్డారు.
కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపిస్తూ.. "నా అభ్యర్థిత్వాన్ని మారుస్తూ కాంగ్రెస్ పార్టీ నన్ను, నా జాతిని నమ్మించి గొంతు కోశారు. మా జాతి ఆత్మ గౌరవాన్ని చులకన చేశారు. మాకు జరిగిన మోసానికి తగిన ప్రతిఫలం తప్పదు. ఎవరెన్ని అవమానాలు చేసిన బరి తెగించి కొట్లాడతా.. బరా బర్ పటాన్ చెరు ఎమ్మెల్యే బరిలో ఉంటాను. నన్ను నమ్ముకున్న ప్రజల, కార్యకర్తల కుటుంబ పెద్దగా అండగా నిలబడతాను. కడుపులో పెట్టి చూసుకుంటా.. నా అనుచరులతో కలిసి నామినేషన్ వేస్తాను.. నాకు జరిగిన మోసాన్ని వివరిస్తూ ప్రజా క్షేత్రంలోకి వెళ్తానని" తేల్చి చెప్పారు.
పటాన్ చేరు నియోజకవర్గం నుంచి ముదిరాజ్ ముద్దు బిడ్డ కు కాంగ్రెస్ పార్టీ బి ఫాం రానీయకుండా దామోదర్ రాజనర్సింహ అడ్డుకున్నాడని ఆరోపించారు నీలం మధు. ఆంథోల్ లో దామోదర్ ఎట్ల గెలిస్తాడో చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. నమ్మించి మోసం చెయ్యడం కాంగ్రెస్ పార్టీ నైజం అంటూ సోనియా, రాహుల్ గాంధీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాగా పోటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ నీలం మధు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. శుక్రవారం పోటా పోటీగా కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు నామినేషన్లు వేయనున్నారు. ఈ నేపథ్యంలో పటాన్‌చెరులో టెన్షన్ వాతావరణం నెలకొంది.