KCR : జనగామ ప్రజల సమక్షంలో.. కేసీఆర్ ముందు పల్లా డిమాండ్లు
జనగామను జిల్లా చేసి.. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగారో కృషి చేస్తున్నారని జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సాగు నీరు, మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేసీఆర్ కు.. జనగాంకు ఏం కావాలో తన కన్నా ఆయనకే ఎక్కువ తెలుసని చెప్పుకొచ్చారు. జనగామ అభివృద్ధిలో పాలు పంచుకునే అదృష్టాన్ని తనకు కల్పించడం ఆనందంగా ఉందని పల్లా తెలిపార. ఈ అవకాశాన్ని కల్పించిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. జనగామలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో మాట్లాడిన పల్లా.. ఆ నియోజకవర్గానికి కావాల్సిన, చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పల్లా.. జనగామ రైతుల సాగు కోసం పంట కాలువలు, చెక్ డ్యాంలు, మిని లిఫ్ట్ లు అందించాలని కేసీఆర్ ను కోరారు. అంతేకాకుండా నర్సింగ్ కాలేజ్, పారా మెడికల్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్ స్థాపించాలని విజ్ఞప్తి చేశారు. చీటకోడు రిజర్వాయర్ ను బాగు చేసి జనగామ ప్రజలకు స్వచ్చమైన సాగునీటిని అందించాలని కోరారు. ప్రజల పక్షాన మాట్లాడిన పల్లా.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న జనగామకు డ్రైనేజ్, రంగప్ప చెరువు డెవలప్మెంట్, డీసీపీ ఆఫీస్, స్పోర్ట్ స్టేడియం, కళాభవనం కావాలని కోరారు.
బచ్చన్న పేట, చేర్యాల, నర్మెట్టలో జూనియర్ కాలేజీల ఏర్పాటు చేసి.. విద్యార్థుల భవిష్యత్తుకు తోర్పడాలని సూచించారు. ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని, దూల్మిట్ట, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాలను కలిపి.. రెవెన్యూ డివిజన్ గా చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా చేర్యాలలో ఫైర్ స్టేషన్, మినీ స్టేడియం ఏర్పాటు, పట్టణాభివృద్ధి, పెద్ద చెరువు పునరుద్దరణతో పాటు, కొమురవెల్లి మల్లన్న చెరువును కూడా డెవలప్ చేయాలని ఈ సభ సందర్భంగా కేసీఆర్ ను కోరారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల తరహాలో జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు పల్లా హామీ ఇచ్చారు.