TS Assembly Elections 2023 : పార్టీ మారిన ఎమ్మెల్యేలను పక్కనబెట్టిన ప్రజలు
తెలంగాణలో కాంగ్రెస్ దుమ్మురేపింది. ఇప్పటికే 31 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ.. మరో 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. కాగా గతంలో కాంగ్రెస్ తరుపున గెలిచిన బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ప్రజలకు షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరగా.. అందులో 9మంది ఓడిపోయారు. తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి, పినపాకలో రేగా కాంతారావు, కొల్లాపూర్లో బీరం హర్షవర్ధన్ రెడ్డి, నకిరేకల్లో చిరుమర్తి లింగయ్య, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్, పాలేరులో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ఓడిపోయారు.
కాంగ్రెస్ దెబ్బకు అటు మంత్రులు సైతం కంగుతిన్నారు. చాలా స్థానాల్లో మంత్రులు వెనుకంజలో ఉన్నారు. గత ఆరు పర్యాయాలు పాలకుర్తిలో వరుసగా గెలుస్తూ వస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈ సారి అక్కడి ప్రజలకు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన యశస్విని రెడ్డి విజయం సాధించారు. అదేవిధంగా ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైతం ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గెలిపొందారు. ధర్మపురిలో మంత్రి కొప్పలు ఈశ్వర్ సైతం ఓటమి దిశగా వెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో ఓడిపోయారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలిచారు. వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి మెగారెడ్డి విజయం సాధించారు.