తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో సోదాలు.. పొంగులేటి అనుమానాలు

Update: 2023-11-08 07:05 GMT

మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో బుధవారం పోలీసులు సోదాలు చేశారు. ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన రెండు నివాసాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. పోలీసులతో పాటు ఈసీ అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35 వేల బోగస్ ఓట్లను చేర్పించారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మంత్రి అజయ్ సూచన మేరకు కలెక్టర్, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు బోసగ్ ఓట్లను చేర్పించారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ విషయమై ఎన్నికల అధికారులకు , జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆ ఫిర్యాదులో తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించారు. ఈ ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీసిటీ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తనతోపాటు కుటుంబ సభ్యుల ఇళ్లపైనా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ సోదాలు జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై తనపై ఐటీ దాడులు చేయించాలని చూస్తున్నాయని అన్నారు. కొందరు పోలీసులు బీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఇలాంటి ఇబ్బందులు కొన్ని రోజులు తప్పవని పొంగులేటి వ్యాఖ్యానించారు.

తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, తుమ్మల నాగేశ్వరరావు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే బిఆర్‌ఎస్‌ టిక్కెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే కేటాయించారు. దీంతో అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఆ పార్టీ ఆహ్వానం మేరకు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.




Tags:    

Similar News