కారు డోర్లలో రూ. 1.20 కోట్లు.. ఎలా పట్టుకున్నారంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది. తాజాగా, బుధవారం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రూ. 1.20 కోట్ల నగదు పట్టుబడింది. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో నాచారం పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని ప్రధాన రోడ్డులో ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎస్సైలు గంగాధర్ రెడ్డి, సారంగపాణి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నాగోల్‌కు చెందిన సునీల్ రెడ్డి మెకానిక్ శరత్ బాబుతో కలిసి కారులో నాచారం నుంచి భువనగిరి వెళ్తున్నారు. వారి కారును పోలీసులు తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా వ్యవహరించడంతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ క్రమంలో కారులో ఉన్న సునీల్ రెడ్డి భయపడి.. తాము కారు డోర్ల స్క్రూలను తీసి అందులో నగదు రవాణా చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో పోలీసులు నగదు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు. హయత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో కూడా బుధవారం రాత్రి పోలీసులు రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పెద్దఅంబర్‌పేట్ సదాశివ్ ఎన్‌క్లేవ్ నుంచి పెద్దమొత్తంలో డబ్బులు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో ORR సమీపంలో ఓ కారును తనిఖీ చేశారు. అందులో రూ.2కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారు. హయత్‌నగర్‌కు చెందిన సంపతి శివకుమార్‌రెడ్డి, సురకంటి మహేందర్‌రెడ్డి, తాటికొండ మహేందర్‌రెడ్డి, నిమ్మని నవీన్‌కుమార్‌రెడ్డి, సుర్వీ రమేశ్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ డబ్బును చౌటుప్పల్‌కు తరలిస్తున్నట్లుగా తెలిసిందని ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వర్‌రావు తెలిపారు
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో సొమ్ము తెలంగాణలోనే లభ్యమైంది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ. 1760 కోట్ల విలువైన డ్రగ్స్, నగదు, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు సోమవారం తెలిపారు. , ఈసారి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా 225.25 కోట్ల నగదును సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో రూ.225.25 కోట్ల నగదు సహా మొత్తం రూ.659 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ముగిసేనాటికి ఈ గణాంకాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.