Ponguleti Srinivas Reddy : పంతం నెగ్గించుకున్న పొంగులేటి.. ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు..

Byline :  Veerendra Prasad
Update: 2023-12-04 03:16 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కనిపించింది. మొత్తం 10 స్థానాలకు గానూ కాంగ్రెస్ 8 చోట్ల గెలుపొందగా.. ఒక చోట సీపీఐ, మరో చోట బీఆర్ఎస్ గెలిచాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ లో బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చి.. ఆ పార్టీ అధినేతకు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కనివ్వనంటూ ఛాలెంజ్ విసిరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. గత ఎన్నికలలో ఖమ్మం జిల్లా నుంచి కేవలం ఒక్క సీటు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని పేర్కొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఆ ఒక్క స్థానాన్ని కూడా గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పారు. 2023లో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఖమ్మం జిల్లాలో రాకుండా చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వనని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.

అయితే అనుకున్నట్లుగానే ఖమ్మం జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలు (ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి) ఉండగా.. అన్నిచోట్లా కాంగ్రెస్సే విజయకేతనం ఎగరేసింది. ఇక భద్రాచలం(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)లో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ.. అక్కడ గెలిచిన తెల్లం వెంకట్రావ్ పొంగులేటి వర్గానికి చెందిన నేత. ఎన్నికల ముందు పొంగులేటితోపాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తెల్లం వెంకట్రావ్.. భద్రాచలం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకే ఇస్తారని ఊహించి వెంటనే బీఆర్ఎస్‌లో చేరి టికెట్ సంపాదించారు. ఈ ఎన్నికల్లో తెల్లం వెంకట్రావు 53,253 ఓట్లతో గెలుపొందగా.. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య 5719 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అయితే గెలిచిన కొన్ని గంటల్లోనే తెల్లం వెంకట్రావు.. టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఆయన రేవంత్ రెడ్డిని కలిసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. ఆ ఫొటోలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉండగా.. ఇక ఆయన కాంగ్రెస్‌లో చేరటం దాదాపు ఖరారైనట్టుగానే కనిపిస్తోంది. అయితే.. తన ప్రాంత అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు వెంకట్రావు చెప్తున్నట్టు తెలుస్తోంది.




 





Tags:    

Similar News