Telangana Elections 2023 : పోలింగ్ మొదలైంది.. మొదటి ఓటు పడింది

Byline :  Bharath
Update: 2023-11-20 03:34 GMT

తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ప్రచారంలో జోరు పెంచారు. ముఖ్య నాయకులంతా నియోజకవర్గాల్లో పర్యటిస్తుంటే.. కార్యకర్తలు, అభ్యర్థులు గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కుల సంఘాల ఓటు బ్యాంకు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా తాజాగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రత్యేక కేటగిరీ ఓటర్లు తమ ఇళ్ల నుంచే ఓటు హక్కును వినియోగించే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు ఆదివారం (నవంబర్ 19) సిద్దిపేట జిల్లాలోని లింగరాజుపల్లి స్థానికుడు మర్కంటి పెదరాజయ్య (85)తో అధికారులు పోస్టల్‌ ఓటు వేయించారు.

కాగా ఆ ప్రాంతంలో మొత్తం 28 మంది వృద్ధులు, దివ్యాంగులు పోస్టల్ ఓటు హక్కుకోసం పేర్లు నమోదుచేసుకోగా.. ఆదివారం 21 మంది ఓట్లు వేశారు. ప్రతీ నియోజకవర్గంలో ఈ ప్రక్రియను మూడు రోజుల చొప్పున నిర్వహిస్తారు. ఈనెల 29లోపు పూర్తి ప్రక్రియ ముగుస్తుంది. పోస్టల్ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో వృద్ధులు, దివ్యాంగులు, జర్నలిస్టులు తదితర వర్గాలకు చెందిన 28,057 మంది ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి గ్రామాలు, నివాసాల వారీగా రూట్లను నిర్ధారించిన అధికారులు, ఓ ప్రణాళిక ప్రకారం వారి ఇళ్లకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. తాము ఏ టైంకు ఓటర్ ఇంటికి వెళ్తున్నామని ఆయా పార్టీ నాయకులకు, ఓటర్లకు ముందే సమాచారం అందిస్తున్నారు.

అయితే అధికారులు వెళ్లిన సమయంలో ఓటర్ ఇంటివద్ద లేకపోతే.. ఎలక్షన్ కమిషన్ ఆదేశం మేరకు మరో తేదీని కేటాయిస్తారు. ఈ క్రమంలో ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే 3.6 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ హక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం బ్యాలెట్ పత్రాల ముద్రణ మంగళవారం నాటికి పూర్తవుతుంది. ఎలక్షన్ డ్యూటీ చేసేవారు గతంలో.. పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని తమతో పాటు ఇంటికి తీసుకెళ్లి, ఓట్ల లెక్కింపురోజు ఉదయం ఎనిమిది గంటల్లోపు ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులకు అప్పగించేవారు. ఈసారి మాత్రం పోలింగ్ విధులకు వెళ్లడానికి ముందే ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.




Tags:    

Similar News