TS Assembly Elections 2023 : బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి - రాహుల్ గాంధీ

Byline :  Kiran
Update: 2023-10-18 14:28 GMT

రాష్ట్రంలో జరగనున్నవి దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన విజయ భేరి యాత్ర బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పాటుచేశామని రాహుల్ స్పష్టం చేశారు. ఏ పార్టీ కూడా తమకు నష్టం జరిగే నిర్ణయం తీసుకోదని... అయినా రాజకీయ లాభనష్టాలు పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని అన్నారు.

సీఎం కేసీఆర్ తన హయాంలో అన్ని వర్గాలను మోసం చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తామని మాట ఇచ్చి తప్పాడని, లక్ష రుణమాఫీ హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ పేరుతో రైతుల భూములను కేసీఆర్ లాక్కున్నాడని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజల జేబుల్లోని లక్ష కోట్లు దోచుకుండని రాహుల్ ఆరోపించారు.

రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాత్రమే ఎన్నిక జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటికే ఓటమి అంగీకరించిన బీజేపీ.. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు కలిసి పనిచేస్తున్నాయన్న ఆయన.. ఆ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని చూస్తున్నాయని అన్నారు.

బీజేపీ కోరుకున్నట్లే బీఆర్ఎస్ నడుచుకుంటోందని, పార్లమెంటులోనూ కేసీఆర్ పార్టీ మోడీకి అన్ని విధాలా సహకరిస్తోందని రాహుల్ ఆరోపించారు. విపక్ష నేతలను టార్గెట్ చేసే కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్పై మాత్రం ప్రేమ చూపుతోందని అన్నారు. తనపై 24 కేసులు పెట్టి, ఇల్లు లాక్కొని, లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయించిన మోడీ సర్కారు.. కేసీఆర్పై సీబీఐ, ఐటీ, ఈడీ ఎంక్వైరీలు లేకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని ప్రజలు గుర్తించాలని రాహుల్ సూచించారు.




Tags:    

Similar News