Rahul Gandhi : రంగంలోకి రాహుల్ గాంధీ.. వ్యూహం మార్చిన కాంగ్రెస్
ఎన్నికల కౌంటింగ్ వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపడంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. అభ్యర్థులు చేజారకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ వేళ అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలు దాటి బయటకు రావొద్దని రాహుల్ సూచించారు. ఏఐసీసీ పరిశీలకులు కూడా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలన్నారు. ఒకవేళ ఏమైన ఇబ్బందులు ఉంటే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకరావాలని సూచించారు.
అదేవిధంగా ఇంతకు ముందు హైదరాబాద్ రావాలని చెప్పిన అభ్యర్థులను కూడా రావద్దని కాంగ్రెస్ ఆదేశించింది. అందరూ కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని సూచించింది. మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాల మానిటరింగ్ బాధ్యతల్ని అధిష్టానం కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు అప్పగించింది. గెలిచినా, హంగ్ లేదా తక్కువ మెజార్టీ వచ్చినా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంపుకు సన్నాహాలు చేస్తున్నారు. హంగ్ వస్తే క్యాంప్ రాజకీయాలన్నీ డీకే కనుసన్నల్లోనే జరగనున్నట్లు సమాచారం. మేజిక్ ఫిగర్ దాటినా ఎమ్మెల్యేలందరినీ బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనున్న 49 కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పరిశీలకులను ఏఐసీసీ నియమించింది.