Rahul Gandhi :17న తెలంగాణకు రాహుల్ గాంధీ.. 6 రోజుల పాటు ప్రచారం
తెలంగాణలో పోలింగ్కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారం ఉద్ధృతం చేశాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం వరుస సభలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలోనే మళ్లీ తెలంగాణకు రానున్నారు. ఈసారి ఆరు రోజుల పాటు ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు టూర్ షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం.
రాహుల్ గాంధీ ఈ నెల 17న తెలంగాణకు రానున్నారు. 23వ తేదీ వరకు ఆయన ఇక్కడే ఉండనున్నారు. ఆరు రోజుల పాటు ఆయన వరుసగా సభల్లో పాల్గొంటారు. తొలిరోజు రాహుల్ పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో నిర్వహించే కాంగ్రెస్ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. మరోవైపు టైం తక్కువ ఉండటంతో పార్టీ అగ్రనేతలు అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కాంగ్రెస్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.