Rahul Gandhi Priyanka Gandhi : వరుస సభలతో కాంగ్రెస్ జోరు.. రాష్ట్రానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

Byline :  Bharath
Update: 2023-10-05 16:48 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగుతున్నాయి. ప్రధాని మోదీ, అమిత్ షా, సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ.. ఇలా అగ్రనేతల రాకతో రాజకీయం వేడెక్కింది. రసవత్తర రాజకీయాలకు తెలంగాణ వేదికగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. జాతీయ పార్టీలు కూడా అధికారం చేజిక్కించుకునే దిశగా తమ పావులు కదుపుతూ.. వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రానున్నారు. అక్టోబర్ రెండో వారంలో.. మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు.

మరోవైపు ప్రియాంక గాంధీ కూడా తెలంగాణకు రానున్నారు. అక్టోబర్ చివరి వారంలోగానీ.. నవంబర్ మొదటి వారంలో గానీ ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటిస్తారు. నిజామాబాద్ లో ఉమన్ డిక్లరేషన్ సభ ఏర్పాటుచేయనున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో పలు జిల్లాల్లో ప్రత్యేక సభలు ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ మీటింగ్, విజయ భేరి పేరుతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో మరికొన్ని సభల ఏర్పాటుకు టీ కాంగ్రెస్ నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించినందుకు.. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ సభల్లో మరికొన్ని హామీలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.






Tags:    

Similar News