Revanth Reddy : సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం.. అందుకే బీఆర్ఎస్ అరాచకాలు - రేవంత్ రెడ్డి

Byline :  Kiran
Update: 2023-10-31 13:12 GMT

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరులోని 14కు 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కొల్లాపూర్ లో నిర్వహించిన పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొన్న ఆయన.. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబం లక్షల ఎకరాల భూముల్ని ఆక్రమించిందని, ఆయన ఇంట్లోనే నాలుగు పదవులు వచ్చాయని రేవంత్ మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. గడిచిన పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శించారు. జిల్లా నుంచి వలసలు ఆగలేదని, ఆత్మహత్యలు తగ్గలేదని అన్నారు. పాలమూరును పట్టెడన్నం పెట్టేలా మార్చాలంటే జిల్లాకు చెందిన నాయకుడే కీలక పదవిలో ఉండాలని అన్నారు. పాలమూరు బిడ్డలంతా కాంగ్రెస్ కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలనెలా రూ.2500 ఇవ్వడంతో పాటు రూ.500లకే సిలిండర్ ఇస్తామని చెప్పారు. రైతు భరోసా కింద కౌలు రైతులకు సైతం రూ.15 ఇస్తామని అన్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, అర్హులైనవారందరికీ ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఇక చేయూత స్కీం కింద అర్హులందరికీ ప్రతి నెల రూ. 4వేల పింఛను ఇవ్వనున్నట్లు చెప్పారు.

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపైనా రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ దాడి కాంగ్రెస్ వాళ్లే చేశారని కేసీఆర్ అబద్దాలు చెప్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు తలుచుకుంటే సీఎం కుటుంబసభ్యులెవరూ రోడ్డెక్కరని వార్నింగ్ ఇచ్చారు. తామంతా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందునే బీఆర్ఎస్ అరాచకాలు సాగుతున్నాయన్న రేవంత్.. కేసీఆర్ దాడి నెపాన్ని కాంగ్రెస్ పై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.




Tags:    

Similar News