Revanth Reddy : మరికొద్ది గంటల్లో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం
రాష్ట్ర చరిత్రలో మరికొద్ది గంటల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు. మధ్యాహ్నం 1.04కి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ మేరకు ప్రజా ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ప్రజలందరూ రావాలని రేవంత్ బహిరంగ ఆహ్వానపత్రం విడుదల చేశారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులకు కాంగ్రెస్ పార్టీ అహ్వానాలు పంపించింది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు పలువురు ఇతర నేతలను రేవంత్‌రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబంగా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు జగన్మోహన్‌రెడ్డి, స్టాలిన్, మమతా బెనర్జీ, సుఖ్విందర్ సింగ్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకేశివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులతో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మాజీ సీఎంలు అశోక్ గహ్లోత్, భూపేష్ బఘెల్, అశోక్ చౌహాన్‌లను ఆహ్వానించింది.
వారితోపాటు ఇంకా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు... న్నతాధికారులకు, మేధావులకు కాంగ్రెస్ ఆహ్వానాలు పంపింది. కొత్తగా ఎన్నికైన 119మంది ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాలో అధ్యక్షులను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల్లో 300మందితో పాటు కోదండరాం, హరగోపాల్, కంచె ఐలయ్య సహా 250మంది ఉద్యమకారులను ప్రత్యేకంగా ఆహ్వానించింది
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితోపాటూ.. మరో 9 మంది కూడా ప్రమాణం చేస్తారని తెలిసింది. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి, తుమ్మల నాగేశ్వరరావు, షబ్బీర్ అలీ, కొండా సురేఖ, ప్రేమ సాగర్ రావుకి ఛాన్స్ ఉంటుందని తెలిసింది.ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రకటించిన 6గ్యారంటీల్లో ఒకదానిపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసే సూచనలున్నాయి. అలాగే రజని అనే దివ్యాంగురాలికి తొలి ఉద్యోగాన్ని ఇస్తూ ఫైలుపై సంతకం చేయనున్నట్లు సమాచారం