Sonia Gandhi : తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ వీడియో సందేశం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున అన్ని పార్టీలు జోరుగా క్యాంపెయినింగ్ నిర్వహించాయి. ప్రచార గడువు ముగిసే నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే క్యాంపెయినింగ్ కు చివరి రోజైన మంగళవారం రోజు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలను తానెప్పటికీ మర్చిపోనని, వారికి ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటానని అన్నారు. మార్పు కోసం కాంగ్రెస్కు ఓటేయాలని సోనియా పిలుపునిచ్చారు.
"ప్రియమైన సోదర సోదరీమణులారా! నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా.. కానీ మీరు నా మనసుకు చాలా దగ్గరగా ఉన్నారు. నేను ఈ రోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి కావడం చూడాలనుకుంటున్నాను. దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలి. మీ కలలు సాకారం కావాలి. మీకు మంచి ప్రభుత్వం లభించాలి. నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు చాలా గౌరవం ఇచ్చారు. ఈ ప్రేమ ,అభిమానాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు నా విన్నపం ఒక్కటే... మార్పు కోసం కాంగ్రెస్కు ఓటేయండి. మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి" అని సోనియా గాంధీ తన వీడియో సందేశంలో చెప్పారు.