TS Assembly Elections 2023 : మునుగోడు అభ్యర్థిగా కాంగ్రెస్ నన్నే ఎంపిక చేస్తుంది: చలమల్ల
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో.. మునుగోడులో పోటీచేయబోయే అభ్యర్థి ఎవరనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అప్పటివరకూ మునుగోడు సీటు తమదే అన్న ధీమా వ్యక్తం చేసిన నేతలు.. ప్రస్తుతం కలవరానికి గురవుతున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చలమల్ల కృష్ణారెడ్డి పోటీ ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అయితే రాజగోపాల్‌రెడ్డి చేరిక అంశంపై పీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డిని వివరణ కోరగా.. ఆయన స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గురువారం చౌటుప్పల్ లో తమ అనుచరులతో సమావేశం నిర్వహించారు చలమల్ల. చౌటుప్పల్ మండలం దామెరలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. మునుగోడు అభ్యర్థిగా కాంగ్రెస్ నన్నే ఎంపిక చేస్తుందన్నారు. రాజగోపాల్‌రెడ్డి నా అభ్యర్థిత్వానికి మద్దతిస్తారని భావిస్తున్నానని తెలిపారు. సీపీఐ, సీపీఎం సహకారంతో మునుగోడులో విజయం సాధిస్తామన్నారు.
ఇక అంతకుముందు తనకే టికెట్ దక్కుతుందని కృష్టారెడ్డి భావించారు. అయితే రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంతగూటికి చేరడంతో మునుగోడు లో పోటీచేయబోయేది ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరకముందే రాజగోపాల్‌రెడ్డి తాను మునుగోడు నుంచి పోటీ చేస్తానని చెప్పడం సరైంది కాదని చలమల్ల కృష్ణారెడ్డి తన అనుచరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం మంగళవారం చౌటుప్పల్ పార్టీ ఆఫీస్‌లో కూడా మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు సీటును సీపీఐకి కేటాయిస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సొంత పార్టీ నేతలే కొందరు అపోహలు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే సీటు ఎవరికి దక్కుతుందనే విషయం తేలాలంటే మరో రెండ్రోజులు ఎదురుచూడక తప్పదు