Telangana Assembly Elections:నామినేషన్ల ఉపసంహరణకు నేడే ఆఖరు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన తర్వాత .. బరిలో 2898 మంది అభ్యర్థులు మిగిలారు. సోమవారం జరిగిన వెరిఫికేషన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను తిరస్కరించారు ఎన్నికల అధికారులు. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్‌లో అత్యధికంగా 114 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మేడ్చల్‌లో 67, కామారెడ్డిలో 58 మంది, ఎల్బీ నగర్లో 50 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్‌లో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. నారాయణపేటలో అత్యల్పంగా కేవలం 7 మందే బరిలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తైన తరువాత చివరగా బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది.
ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెబల్స్‌ను తప్పించేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించేందుకు ఆయా పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగుతున్నారు. అధికారంలోకి వచ్చాక అధిష్ఠానంతో మాట్లాడి నామినేటెడ్ పదవులిస్తామంటూనే ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు. కొన్నిచోట్ల రెబల్స్ మెత్తబడుతున్నా మరికొన్నిచోట్ల మాత్రం బరి నుంచి తప్పుకునేదే లేదంటూ తెగేసి చెబుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం వరకు గడువు ఉండటంతో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.