పదవి దక్కాలంటే.. పల్లె బాట పట్టాల్సిందే..

Byline :  Veerendra Prasad
Update: 2023-11-06 08:18 GMT

ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోలాహలమే. ప్రచారం మొదలు నుంచి పోలింగ్ రోజు వరకూ ప్రతీచోటా జనసందోహంతో ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోతాయి. మహానగరాల్లో చదువులు, ఉద్యోగాలంటూ ఎవరి హడావుడి వారిదే కానీ.. పల్లెల్లో అయితే ఈ సమయం జాతరలా ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల హామీలతో అయినా తమ బతుకుల్లో మార్పు వస్తుందనే ఆశతో జనాలు ప్రచారాలకు, బహిరంగ సభలకు పోటెత్తుతుంటారు. ఆయా రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రచారాన్ని ఎక్కువగా పల్లెల్లోనే దృష్టి పెడుతుంటారు. అందుకు ముఖ్య కారణం రాష్ట్రంలో 61% ప్రజలు పల్లెవాసులే. మరో ముఖ్య విషయం ఏంటంటే.. పట్టణాల్లో ఉంటున్న విద్యావంతులతో పోలిస్తే తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే వారిలో పల్లె జనాలే ఎక్కువుంటారు. గత రెండు దఫాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కు వచ్చిన సీట్లను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 2014లో బీఆర్ఎస్ కు వచ్చిన సీట్లలో 62 శాతం గ్రామీణ ప్రాంతాలవి కాగా... 2018లో అది 69 శాతం.

పల్లెల్లో ప్రతిఒక్కరిలో ఓటు వేయాలనే చైతన్యం ఉంటుంది. గ్రామాల్లోని వారు ఒకరికొకరు కలుస్తూ, ఓటింగ్ కు వెళుతుంటారు. ప్రభుత్వం నుంచి ఎక్కువగా ఆయా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేవారు పల్లె ప్రజలే కావడం వల్ల.. ఓటేయకపోతే ఎలా అన్న ఓ రకమైన ఉద్వేగం కూడా వారిలో ఉంటుంది. ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజల ప్రాధాన్యం తెలిసిన రాజకీయ పార్టీలు కూడా.. ఎన్నికలకు ముందు నుంచే అక్కడ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు పల్లె బాట పట్టి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇళ్లల్లో మహిళలను, వృద్ధులను, పొలాలకు వెళ్లి.. వరి కోతల్లో నిమగ్నమైన రైతులను, కూలీలను కలుస్తున్నారు. సామాజికవర్గాల వారీగా సమావేశాలు, యువజన, మహిళా సంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించని ప్రజాప్రతినిధులను పలు గ్రామాల్లో ప్రజలు సైతం నిలదీస్తున్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత అధికార పార్టీ.. తమ సంక్షేమ పథకాలతోనే లబ్ధి చేకూరిందంటూ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. తమ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిపై ప్రచారం చేస్తోంది. రైతుబంధు, దళితబంధు, పోడు పట్టాలు, గొర్రెల పంపిణీ వంటి పథకాలతో పాటుమిషన్‌ భగీరథ, ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్లు, మన ఊరు-మనబడి, కంటి వెలుగు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, బీసీబంధులతో పల్లె ప్రజలకు మేలు చేశామని చెప్పుకుంటోంది. ఇక బీజేపీ నేతలు పంచాయతీలకు కేంద్ర నిధులు, ఉపాధిహామీ పథకం నిర్వహణ, గ్రామీణ మహిళలకు ఉజ్వల పథకం కింద సిలిండర్లపై సబ్సిడీ తదితర అంశాలను ప్రస్తావిస్తున్నారు. పల్లెల్లో సమస్యలను తెలియజేస్తూ వాటి పరిష్కారంలో వైఫల్యాలను కాంగ్రెస్‌ నేతలు ఎండగడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే అన్నింటినీ నెరవేరుస్తామని చెబుతున్నారు.




Tags:    

Similar News