Telangana Elections: రాసిపెట్టుకోండి.. ఈ ఎన్నికల్లో గెలిచేది వాళ్లే

Byline :  Veerendra Prasad
Update: 2023-11-08 02:54 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30న జరగనున్న నేపధ్యంలో.. ఆయా ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటూ వాగ్ధానాలు చేస్తున్నారు. వజ్రాయుధం లాంటి ఓటు హక్కు వినియోగించుకొని తమను సింహాసనంపై కూర్చోబెట్టాలని విన్నవిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువతే లక్ష్యంగా ఆయా పార్టీలన్ని వారికి అనుకూలంగా వరాలు కురిపిస్తున్నాయి. అందుకు ముఖ్య కారణం.. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 71 శాతం మహిళలు, యువ ఓటర్లే.

తాము అధికారంలోకి రావాలంటే.. ఆయా నియోజకవర్గ ఓటర్లు.. సగం మంది ఓటేసినా గెలిచినట్లే అనుకుంటున్నారు. అందుకే మొత్తం ఓటర్లలో సగానికి పైగా ఉన్న యువ, మహిళా ఓటర్లను తమవైపుకు తిప్పుకోవాలనుకుంటున్నారు. వాళ్లను టార్గెట్ చేస్తే చాలు.. ఈజీగా గద్దెనెక్కుతామనే ఆలోచనలో ఉన్నారు. గత ఎన్నికల ఫలితాల ఆధారంగా విశ్లేషిస్తే పోలైన ఓట్లలో సగటున 40శాతానికి మించి ఎవరు ఓట్ల కొల్లగొడతారో వారినే విజయం వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీచేసిన బీఆర్​ఎస్ 88 స్థానాల్లో గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 19స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది. బీజేపీ మాత్రం ఓకే ఒక్క స్థానాన్ని దక్కించుకుంది. ఇక మిగతా పార్టీలు(టీడీపీ,ఎంఐఎం,స్వతంత్ర అభ్యర్థులు) 12 స్థానాలు గెలుచుకున్నారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదు. దాదాపు అన్ని నియోజక వర్గాల్లో బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్ధుల మధ్య పోటీ పెరిగింది. రెబల్, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు.. ఇంకా ప్రజారాజ్యం, జనసేన, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలతో ఈ సారి అభ్యర్థుల సంఖ్య కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలో పోటీచేసిన ప్రతిచోట కనీసంగా 40 శాతం ఓట్లను ఏ పార్టీ దక్కించుకుంటుందో ఆ పార్టీ అభ్యర్థులే గెలిచే అవకాశం కనిపిస్తోంది. కర్టాటకలో 'బీజేపీ- కాంగ్రెస్' మధ్య ఓటింగ్ శాతాల్లో స్వల్ఫ తేడానే ఉన్నా.. అత్యధిక సీట్లను కాంగ్రెసే కొల్లగొట్టి అధికారంలోకి రాగలిగింది. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడం అభ్యర్ధులకు కీలకంగా మారనుంది.

తెలంగాణలో ప్రతి నియోజక వర్గం నుంచి పోటీ చేసిన సగటు అభ్యర్ధుల సంఖ్య 15. గత ఎన్నికల్లో 6 నుంచి 10 మంది అభ్యర్థులు పోటీ చేసిన నియోజక వర్గాలు 22 ఉంటే, 11 నుంచి 15 మంది పోటీ చేసిన నియోజక వర్గాలు 58 ఉన్నాయి. 15 కంటే ఎక్కువ అభ్యర్ధులున్న నియోజక వర్గాల సంఖ్య 38గా ఉంది. బీఆర్​ఎస్​, కాంగ్రెస్, బీజేపీ(BJP) అన్నిచోట్ల బలమైన అభ్యర్థులను నిలుపుతోంది. ఈసారి ఆయా పార్టీల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నాయకులు సైతం చాలా మందే ఉన్నారు. వారంతా స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. బీఎస్పీ, ఆమ్ ఆద్మీ, జనసేన లాంటి పార్టీలూ బరిలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు కనీసంగా 40శాతాన్ని టార్గెట్ గా పెట్టుకుంటారో వారినే విజయం వరిస్తుంది.




Tags:    

Similar News