Minister Seethakka : నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 14 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ

Byline :  Veerendra Prasad
Update: 2023-12-19 03:11 GMT

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజలకు వరుస శుభవార్తలు తెలుపుతోంది. ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో.. రెండింటిని అమలు చేసిన రేవంత్ సర్కార్, సంక్రాంతి లోపు మరికొన్నింటిని అమలుచేస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా నిరుద్యోగులకు కూడా ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేపడతామని ప్రకటించింది. తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలియజేశారు. ఏకంగా 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి మంత్రి సీతక్క సోమవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. అంగన్‌వాడీలో ఉద్యోగ నియామకాల వల్ల ఎక్కువగా మహిళలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా ప్రభుత్వం ఈ నియామకాలకు ఎలాంటి అర్హతలను నిర్ణయిస్తుందో చూడాల్సి ఉంది.

ఇక మహాలక్ష్మి పథకం గురించి కూడా మంత్రి మాట్లాడారు. మహాలక్ష్మీ పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారి సంఘాలతో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ చర్చించిన తర్వాతే హామీని ప్రకటించామని తెలిపారు. ఆటోడ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన్నారు.




Tags:    

Similar News