Telangana Assembly:రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం

Byline :  Veerendra Prasad
Update: 2023-12-20 02:42 GMT

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. శాసనసభ వేదికగా ఆర్థిక రంగానికి సంబంధించిన అన్ని విషయాలు, వివరాలు, గణాంకాలు, వాస్తవ పరిస్థితులను సర్కారు వివరించనుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదేపనిగా అప్పులు చేసి, రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిందని కాంగ్రెస్‌ సర్కారు ఆరోపిస్తోంది. బడ్జెట్‌ అప్పులు, గ్యారంటీ అప్పులు మొత్తం కలిపి రూ.5.50 లక్షల కోట్లకు మించిపోయాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇటీవలే వెల్లడించారు.

ఈ క్రమంలో బుధవారం శాసనసభలో.. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, చేసిన ఖర్చు సహా అన్ని వివరాలను శ్వేతపత్రం ద్వారా వివరించనున్నారు. తీసుకున్న అప్పులు, వాటి వడ్డీలు సహా అసలు చెల్లింపులు, ఖజానాపై ఉన్న భారం, చేయాల్సిన చెల్లింపులు తదితర గణాంకాలను పొందుపర్చనున్నారు. ఇదే సందర్భంలో ఆయా రంగాల వారీగా చేసిన ఖర్చు, వచ్చిన ప్రయోజనాలను కూడా శ్వేతపత్రం ద్వారా వివరించనున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలతో పాటు విద్యుత్ కార్పొరేషన్లు, పౌరసరఫరాల సంస్థ, నీటిపారుదల ప్రాజెక్టుల కార్పొరేషన్లు, మిషన్ భగీరథ కార్పొరేషన్, తదితర సంస్థల ద్వారా తీసుకున్న రుణాల పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్‌ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించే అవకాశముంది. ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీల కార్యాచరణ, అందుకు అవలంభించే ప్రణాళికను కూడా సభలో వివరించే అవకాశం ఉంది. ఈ ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది.




Tags:    

Similar News