TS Assembly Elections 2023 : ఖమ్మం జిల్లా ముగ్గురు ముఖ్యనేతలకు కేబినెట్‌లో చోటు
తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ముఖ్యనేతలకు మంత్రివర్గంలో చోటుదక్కింది. మధిర నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలుపొందిన మల్లు భట్టి విక్రమార్కకు, గతంలో 17 ఏళ్లకు పైగా మంత్రిగా పనిచేసి కాంగ్రెస్‌లో చేరి ఆరోసారి ఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావుకు , పాలేరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్‌లో స్థానం దక్కింది.
ఈ ముగ్గురిలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. భట్టి విక్రమార్క మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఒకసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్‌కు ఊపు తీసుకొచ్చారు. సీఎల్పీ నేతగా శాసనసభలో ప్రజల తరపున మాట్లాడి అధిష్ఠానం వద్ద ప్రత్యేక గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీ గెలవడంలో తనవంతు పాత్ర పోషించారు. 1961, జూన్ 15న జన్మించిన మల్లు భట్టి విక్రమార్క.. హైదరాబాద్ నిజాం కాలేజ్‌లో డిగ్రీ, HCUలో పీజీ చేశారు. 2009లో తొలిసారి మధిర నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009-11 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ విప్‌గా , 2011-2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు. 2009 – 2023 మధ్య 4సార్లు మధిరలో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఉమ్మడి, స్వరాష్ట్ర మంత్రి వర్గాల్లో సుమారు 17 ఏళ్లకు పైగా మంత్రిగా పనిచేసి కాంగ్రెస్‌లో చేరి ఆరోసారి ఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావుకు కూడా టీ కాంగ్రెస్ మంత్రివర్గంలో చోటు దక్కింది. అంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్న తుమ్మల.. ఆ పార్టీలో విబేధాలు రావడంతో.. రేవంత్‌రెడ్డి ఆహ్వానంతో కాంగ్రెస్‌లో చేరారు. ఖమ్మం నియోజకర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి పువ్వాడ అజయ్‌పై గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో.. తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి, భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తి.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున ఎంపీ గా పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన ఆయన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో గులాబీ పార్టీలో విభేదాలు రావడంతో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇక ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున జోరుగా ప్రచారం నిర్వహించి.. ఉభయ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలవటంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆయనకు రేవంత్ మంత్రివర్గం సీటు కన్ఫామ్ అయింది.