Revanth Reddy : ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్ను గద్దె దించాలి - రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజలు ఆకలిని భరించారు కానీ.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని అందుకే స్వేచ్ఛ, సమానత్వం కోసం ఉద్యమించి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆధిపత్య ధోరణితోనే ముందుకు వెళ్తున్నారని, అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చిందని రేవంత్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించామని రేవంత్ అన్నారు. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్ గద్దె దించాలని.. తెలంగాణవాసులకు ఇదే చివరి ఉద్యమం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఉద్యమం పాలన, అధికారం కోసం కాదని, తెలంగాణ ఆత్మగౌరవం కోసమని అందుకే ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని రేవంత్ అన్నారు. బలహీన వర్గాలు కేసీఆర్ను ఓడించాలన్న కసితో ఉన్నారని చెప్పారు.
ఓట్లు చీల్చి కేసీఆర్కు సహకరించడమే బీజేపీ వ్యూహమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏబీసీడీ వర్గీకరణపై గతంలో వెంకయ్య నాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో చేస్తామన్నారని కానీ ఇప్పటికీ అతీగతి లేదని గుర్తు చేశారు. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా.. బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదని ప్రశ్నించారు. దళితుల ఓట్లు కాంగ్రెస్ పడకుండా చీల్చేందుకే కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగిందని హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయని ఆరోపించారు. అందుకే ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్కు దుఃఖం వస్తుందని విమర్శించారు.