Revanth Reddy : మనవడి కోసమే కేసీఆర్ అధికారం అడుగుతుండు : రేవంత్

Byline :  Krishna
Update: 2023-11-14 13:00 GMT

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందన్నారు. ఎవరైనా ఇసుక మీద బ్యారేజీ కడుతారా? అని ప్రశ్నించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో సామాజిక న్యాయం జరగడం లేదన్నారు.

మనవడిని మంత్రి చేసేందేందుకు కేసీఆర్ మూడోసారి అధికారం అడుగుతున్నారని రేవంత్ ఆరోపించారు. కొడుకు, కూతురు, అల్లుడికి పదవులు వచ్చాయని.. ఇప్పుడు మనవడి పదవి కోసం అధికారం కావాలంటున్నారని మండిపడ్డారు. వాళ్లకు పదవులు కట్టబెట్టేందుకేనా తెలంగాణ సాధించుకున్నది అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని.. కానీ తెలంగాణ విద్యార్థులకు మాత్రం రాలేదన్నారు. కాంగ్రెస్తోనే ప్రతి పేదవాడికి న్యాయం జరుగతుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ఇస్తామన్నారు.

ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇవ్వని కేసీఆర్.. గజ్వేల్లో వెయ్యి ఎకరాల్లో గడీని నిర్మించుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఆయన కొడుకు కేటీఆర్ జన్వాడలో వంద కోట్లతో మరో ఫాంహౌస్ను నిర్మించుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు, ధరణి పోర్టల్ తీసేస్తారని కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఉచిత కరెంట్ తెచ్చిందే కాంగ్రెస్ అని చెప్పారు. వర్ధన్నపేట మరింత అభివృద్ధి జరగాలంటే కేఆర్ నాగరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Tags:    

Similar News