Revanth reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటేనని మళ్లీ రుజువైంది - రేవంత్ రెడ్డి

Byline :  Kiran
Update: 2023-11-25 07:29 GMT

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటేనని కేసీఆర్, మోడీ మధ్య బంధం మరోసారి బయటపడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పోలింగ్ కు 5 రోజుల ముందు రైతుబంధు నిధుల విడుదలకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వడం ఇందుకు నిదర్శనమని అన్నారు. రైతుబంధు డబ్బులు పడ్డాయని రైతులు ప్రభావితం కావొద్దని రేవంత్ సూచించారు. తాము అధికారంలోకి వస్తే 5వేలు ఎక్కువ వచ్చేవని చెప్పారు. కేసీఆర్ ఏది ఇచ్చినా తీసుకోవాలని, మిగతావి కాంగ్రెస్ ఇస్తుందని రేవంత్ ఓటర్లకు పిలుపునిచ్చారు.

బీజేపీ-బీఆర్ఎస్ స్నేహం వల్లే రాష్ట్రంలో తమ పార్టీ అభ్యర్దులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్పై ఐటీ ఈడీ దాడులు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గోయల్ ఇంట్లో 300 కోట్ల డబ్బు ఉన్నా చర్యలు తీసుకోలేదని, కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటామని చెబుతున్న బీజేపీ.. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేసిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్పై బీజేపీ చర్యలు తీసుకోనందుకే వివేక్ ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారని రేవంత్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు ప్రయత్నిస్తే సీఈఓ ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.




Tags:    

Similar News